Thursday, December 27, 2012

నా కొత్త సంవత్సర తీర్మానాలు



  • జీవితంలో మళ్ళీ ఎప్పుడూ నిద్రమాత్ర , ఆముదం ఒకేసారి పుచ్చుకోకూడదు.
  • మెదడుని భద్రంగా సంచిలో పెట్టి, ఆ సంచిని బీరువాలో పెట్టి తాళం వేసిన తర్వాతగాని తెలుగు సినిమాలు చూడకూడదు.
  • పదహారేళ్ళ హీరో, అరవయ్యేళ్ళ హీరోయిన్ తో డ్యూయెట్లేసుకునే చిత్రరాజములను అస్సలు చూడకూడదు.
  • వార్తా విశేషాలు చదివేముందు తప్పనిసరిగా, గుర్తుగా గోడ మీద రాసుకునైనా సరే రక్తపోటు మాత్ర వేసుకోవాలి.
  • వ్యాయామం చేయాలనిపించినప్పుడల్లా....... ప్రెండోడి బొజ్జకన్నా  మనది చిన్నదేలే అని సరిపెట్టుకుని నిద్రపోకుండా.... కనీసం రెండు బస్కీలైన తీయాలి.
  • మన ఆపానవాయువుకి పక్కోణ్ణి బాధ్యుడ్ని చేయకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నించాలి.
  • అంతర్జాల విహారం ఐదు గంటలనుండి ...... ఐదొందల నిముషాలకి తగ్గించాలి.
  • ఫేసుబుక్ లో అమ్మాయిల ఫొటోలకి మొహమాటానికి లైకులు కొట్టడం తగ్గించాలి.
  • బ్లాగులో పోస్ట్ వేసిన తర్వాత ఎవరైనా చూసారా లేదా అని అస్తమానూ చెక్ చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నించాలి.


 

Friday, December 21, 2012

ఇంతకీ నేనెవరంటే..............




తమ్ముడికెందుకు రెండు గుడ్లు... నాకెందుకు ఒక్కటే? అన్న అక్కతో, అమ్మ..... వాడు మగపిల్లాడు వాడితో నీకు పంతమా అని కసిరినప్పుడు చూసావా నా ప్రతాపం అని చూస్తూ ... గుడ్లు గుటుక్కుమనిపించిన పసివాడ్ని.

తమ్ముణ్ణి తోడు తీసుకెళ్ళు అని పదిహేనేళ్ళ అక్కతో.... నాన్న అన్నప్పుడు.... నా యొక్క గొప్పతనం మెల్లమెల్లగా నేర్చుకుంటున్న నాలుగేళ్ల చిన్నవాణ్ణి.   

వంటిట్లో పనేమైనా ఉందేమో చూసుకో ఈ దేశ రాజకీయాలు నీకెందుకు అని నాన్న అమ్మని విసుక్కున్నపుడు...పక్కనే ఉండి..... ప్రవర్తించే పద్ధతి నేర్చుకుంటున్న రేపటి భారతీయ పౌరుణ్ణి.

ఆడ పెత్తనం ఒక బోడి పెత్తనం అని నానమ్మ.... అమ్మ యొక్క మాటల్ని గడ్డిపరకలా తీసిపారేసినప్పుడు... పక్కనే నిశ్శబ్ధంగా........నడత నేర్చుకుంటున్న నూనూగు మీసాలవాణ్ణి. 

క్లాస్ లో, బస్టాప్ లో,  వీధి చివర గోడమీద కూర్చుని దారి వెంటే పోయే అమ్మాయిలను మాటలతో యేడ్పించి అది కాలేజీ కుర్రాళ్ళ   అమాయకపు సరదా అని కాలరెగరేసిన కుర్రాణ్ణి.

దీనికి రేపొద్దున్న బోల్డంతా కట్నాలు పోసి పెళ్లి చెయ్యాలి.... ఇప్పుడు చదువెందుకు దండగ అని..... అమ్మమ్మ చెల్లిని తిడుతున్నప్పుడు..... నిజమే కదా... అనుకున్న దగాకోరు అన్నయ్యని.

కట్నం తీసుకోవడం ఒక నీచాతి నీచమైన దురాచారం అని విశ్వవిద్యాలయంలో...... ఆదర్శం అనే ముసుగులో నీతులు వల్లించి...... మా అమ్మానాన్నల ఒత్తిడి వల్ల తల ఒగ్గాల్సివచ్చింది అని సమర్ధించుకునే దెయ్యాన్ని.

ఆఫీస్ లో మహిళా సహోద్యోగిపై.... పై అధికారి అనుచిత ప్రవర్తన కళ్ళారా చూసినా.... మౌనవ్రతం పాటించే చవట దద్దమ్మని.

బస్సులో ‘స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం... వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనే బోర్డు పక్కనే నిలబడి..... వారి అంగగంగాలను చూపులతోనే శోధించి, వేధించే చిన్న సైజు రేపిస్ట్ ని.

నా సహధర్మచారిణి..... నా కన్నా ఎక్కువ చదివినా, మంచి ఉద్యోగం చేస్తున్నా ఒప్పుకోలేని మానసిక దుర్భలుణ్ణి.

నా భార్య డాక్టర్ అయినా యాక్టర్ అయినా నా మాటే వేదవాక్కు లా పాటించాలనే ఆధిక్యతా జులుం ప్రదర్శించే శాడిస్ట్ భర్తని.   

స్త్రీ అంటే సృష్టికి మూలం, మహాశక్తి, ఆది పరాశక్తి, ఆకాశంలో సగం అని మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్న గడుసు పుండాకోర్ని.

ఢిల్లీలో లేదా మరోచోటో ఒక అమాయకపు ఆడపిల్ల పాశవిక అత్యాచారానికి గురైందని తెలిసినప్పుడు,........ అప్పుడు హటాత్తుగా నాలో మానవత్వం మేల్కొని, రక్తం మరిగి,......... నేను రొజూ చేసే, చూసే అత్యాచారాలు అనుకూలంగా మర్చిపోయి ...... ఆ నరరూప రాక్షసులను......ఉరి తీయ్యాలి, సంసారానికి పనికిరాకుండా చెయ్యాలి, రాళ్ళతో కొట్టి చంపాలి, కోసి కాకులకు గద్దలకు వెయ్యాలి... అని చిలక పలుకులు పలికే...... పచ్చి అవకాశవాదిని.     


ఇంతకీ నేనెవరంటే..............
మీ దురదృష్టం కొద్దీ ఒక క్రోమోసోము తేడా వల్ల మగవాడిగా పుట్టిన ఒక మానవ మృగాన్ని.  




Image source: http://themonkeyboylovescheese.mu.nu/archives/011001.html

Wednesday, December 19, 2012

నేను చదివిన కొన్ని పుస్తకాలు – 1

ది అల్కెమిస్ట్ (The Alchemist) - పవులో క్క్వైలో (Paulo Coelho)
 


అడపా దడపా నేను చదివిన పుస్తకాల్లో అల్కెమిస్ట్ ఒకటి. పవులో గారికి అత్యంత పేరు తెచ్చిన నవల ఇది. ప్రపంచవ్యాప్తంగా 71 భాషలలోకి అనువదింపబడి, గిన్నీస్ బుక్ లో కూడా చేర్చబడ్డ సంటియాగో (Santiago) అనే చిన్న పిల్లవాడి కధ.
అల్కెమిస్ట్ చదివావా.... అది.... ఒక అరుపు, మెరుపు, తురుము అనే విశేషణాల వల్ల... ఒక మంచి ముహూర్తం చూసుకుని, కక్కుర్తిపడి కొనకుండా, ట్రైన్లో పక్కోడి పేపర్... వాడిని అడక్కుండా చదివేసే కుక్క తోక లాంటి అలవాటు వల్ల.... పక్క రూమ్ లో నుండి పుస్తకం తెచ్చుకుని చదివేసా. భూగోళంలో సృజించేవారు తక్కువ, దానిని విమర్శించే వారు ఎక్కువా కాబట్టి, అందునా మనం రెండో వర్గానికి చెందినవాళ్ళం కాబట్టి ఈ బొక్కు గురించి నా నాలుగు మాటలు.  
ముందుగా పుస్తకంలో విషయం ఏంటంటే,
నువ్వు నిజంగా ఏదైనా కావాలని గాట్టిగా తీర్మానించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రకృతి శక్తులన్నీ ఏకమై నీకు అది దక్కేలాగా సహాయం చేస్తాయి. నువ్వు చెయ్యల్సినా పని ఏంటయ్యా... అంటే నీ కలలను మనస్పూర్తిగా నమ్మి... వాటిని అనుసరించడమే.
రెండు ముక్కల్లో కధేంటంటే, సంటియాగో అనే గొర్రెల కాపరి.... తనకు మాటి మాటికీ వచ్చే కలలోని నిధిని నిజం చేసుకోవడానికి తన మందను అమ్మేసి...ఈజిప్ట్ కి బయలుదేరతాడు. దారిలో అతనికి ఎదురయ్యే వ్యక్తులు, అనుభవాలు, అపాయాల సమ్మేళనమే ఈ కధ.
ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన ఈ నవల నాకు అంతగా నచ్చలేదు అంటే.... నాలో అంత మంచి చదువరి లేడేమోనని ముందు బాధా, తర్వాతా జాలి....తర్వాతర్వాత..... నిద్ర ముంచుకొచ్చాయి. ఆ......అన్నీ అందరికి నచ్చాలని రూలేమీ లేదుకదా....అని ఆత్మారాం గాడ్ని బజ్జోపెట్టి... ఏమి నచ్చలేదు అని చించితే.... ఇదిగో ఇవి బయటపడ్డాయి.
రాసిన విధానం – మనకి కొరుకుడు పడాలా. పవులో గారు పోర్చుగీస్లో బాగా రాసారేమో కాని మనం చదివింది ఆంగ్లానువాదం కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చెప్పను, చెప్పలేనంతే.
పాడిందే పాటరా.....  అన్నట్టు చెప్పిందే మళ్ళీ  చెప్పి, తిప్పి తిప్పి  తిరిగి అదే చెప్పేటప్పటికి ఆవులింతలు వచ్చాయి.
చివరగా.... ఈ పుస్తకంలోని కాన్సెప్ట్ నేను టీనేజ్ లో ఉన్నప్పడు చదివినట్లయితే బాగా నచ్చేదేమో. ఇప్పుడు వాస్తవ ప్రపంచం గురించి మరీ అవసరం లేనంతగా (?)  తెలిసిపోయేటప్పటికీ నేను సినికల్ గా మారిపోయి ఈ కధని ఆస్వాదించలేకపోయానేమో.