Showing posts with label వ్యంగ్యం. Show all posts
Showing posts with label వ్యంగ్యం. Show all posts

Sunday, December 16, 2012

విజయవంతంగా ముష్టి వ్యాపారం చేయడం ఎలా?




వెంకాయమ్మ కల్లు పాక వెనుక చింతచెట్టు నీడలో అప్పుడే డ్యూటీ దిగిన సత్తెయ్య, అప్పిగాడు గుఱ్ఱం ఎక్కే పనిలో హడావుడిగా ఉన్నారు.
మావా! నీకు ఈ పెపంచకంలో శానా విసయాలు తెలుసని మనోళ్ళు అనుకుంటున్నారు. నువ్వు మాకన్నా ఎక్కువ సంపాయిస్తన్నావు. నేను రోజంతా అడుక్కున్నా రెండు సీసాల కల్లుకి, ఒక బిర్యానీ పొట్లంకి కూడా సాలట్లేదు. ఎలా మావా..... అడిగాడు అప్పిగాడు.
సత్తెయ్య అర్ధనీలిమ నేత్రాలతో.... పక్కనే ఆకులో ఉన్న ఆవకాయ పచ్చడిని నాలుక మీద రాసుకుంటూ....... చిరునవ్వు నవ్వాడు.
అట్టా ఏదాంతిలాగ  నవ్వమాక! నాకు సిర్రెత్తుకొచ్చేతాది...
నేను రెండు పెస్నలు అడుగుతా.. సమాధానం సెప్పు. మొదటది, నీ బొచ్చెలో మా కన్నా ఎక్కువ సిల్లర ఎందుకు పడుతాది? రెండు, లచ్చలచ్చాలు తగలేసి మేము మా బుడ్దోల్నిఇంగిలీసు సదువుకి పంపుతా ఉంటే, నువ్వెందుకు మీవాన్ని తెలుగు బల్లోకి పంపుతున్నావ్?
ఒరే అప్పిగా, ఇయన్నీ సెప్పాలంటే కూసంత కర్సయిద్దిరా..... అన్నాడు సత్తెయ్య.
ఇదేగా నీ కర్సు ...తీసుకో అంటూ ఒక ఫుల్ కల్లు సీసాని ముందుకు జరిపాడు.
అప్పిగా....నువ్వు ఉస్సేను బోల్టుగాని కంటే ఫాస్ట్ రా....
ఈ బోల్టులు, నట్టులు మనకు తెల్దు కాని......ఇసయం చెప్పు మావా........ అన్నాడు అప్పిగాడు విసుగు మొహంతో.
ఒరే... నువ్వు బిచ్చమెత్తడానికి పోయినప్పుడు ఏమని అడుగుతావు?
అమ్మా.... కొంచెం బిచ్చం పెట్టు తల్లీ..... అని ........అన్నాడు అప్పిగాడు బొచ్చె పైకెత్తి.
సరే... ఆ మాతల్లి దొడ్డ మనసు సేసుకుని మొగుడికి పస్తు పెట్టి నీకు బిచ్చం ఏసిందనుకో.... తర్వాత ఏమంటావ్?
పదికాలాల పాటు సల్లగుండమ్మా అంటా..... చెప్పాడు అప్పిగాడు.
నేనైతే..... ఎల్లగానే భవతీ బిక్షాం దేహీ అనీ... బిచ్చం పెట్టిన తరవాత ‘దీర్ఘాయ్షుమాన్భవ’ అంటాను..... అని రహస్యం చెప్పాడు సత్తెయ్య.
అంటే ..... అర్ధంకాక బుర్ర బరుక్కున్నాడు ....అప్పిగాడు.
ఒరే సన్నాసీ..... నువ్వు అన్నది ...నేను సెప్పింది ఒకటే. నేను మన పూరపోల్లు సెప్పినట్టు సెప్పా అంతే తేడా..
ఈ పట్టు... నేను సెప్పినట్టు సెప్పు ....తరవాత ఆ ఆడ లేడీసు నీ పేరేంటి? అని అడుగుతారు. అప్పుడు ...... నీ పేరు ‘అప్పీసు బాబా’ అని, దేశ సంచారం సేత్తనానని  చెప్పు. యంటనే ఆ యమ్మ కండ్లల్లో... కల్లు మత్తులాంటి... బత్తి మత్తు ఓటి కానొచ్చినాదనుకో... నీ బొచ్చె బోసానం అయ్యిపోద్ది. 

యింక నీ రెండో పెస్నకి సమాదానం యేంటంటే......ఇంకో పది పదేనేల్లుకి ఈ మనుసులు ఈ కూసంత తెలుగు బాస కూడా మర్సిపోతే..... మావోడు నాకన్నా బాగా సంపాయించి.... వాడి తాగాతుకి తగ్గట్టు ఒకటో రెండో అయిలాండులు సీలంక పక్కవాటునే కొనుక్కుంటాడని ఒక అవిడియా.... అంటూ సీసాలో మిగిలిన సరుకుని ఎక్కించాడు.   
మావా... నువ్వు ఈడ ఉండాల్సినోడివి కాదు…… అన్నాడు అప్పిగాడు సత్తెయ్యని కిట్ట పరమాత్ముని లెక్క చూస్తూ..
తెల్సులేరా.... అన్నాడు సత్తెయ్య జోగుతూ ...

***
విజయవంతంగా ముష్టి వ్యాపారం చేయడం ఎలా?
మరిన్ని సూచనలకు, సలహాలకు నేడే సంప్రదించండి.
సత్తానంద సామి
వెంకాయమ్మ కల్లు పాక వెనుక,
బొచ్చె వారి కాలనీ,
మద్యంపూర్, హైదరాబాద్ – 500081.
ఫోన్ – 091-9812345678.
****



Image source: http://www.fun2video.com/funny-beggar/

Saturday, December 8, 2012

నేనెందుకు డాక్టర్ని కాకూడదు?





మా నాన్నగారు మా చిన్నప్పుడు ఆకులు అలములుతో నాటు వైద్యం చేసేవారు మంచి పేరు కూడా గడించారు. ఆ స్ఫూర్తితో నాకు డాక్టర్ అవ్వాలనే ఒక దురద పుట్టింది.  దురద పుడితే గోక్కోవాలి కదా!

డాక్టర్ అవ్వడానికి నీకున్న అర్హతలేంటి! అని బుర్ర తక్కువ ప్రశ్నలు అడగవద్దు.

మీరంతా చిన్నప్పుడు సైన్సు చదివే ఉంటారు కదా! కాబట్టి వైద్యం మా వంశపారంపర్యంగా నాకు జీన్స్ ద్వారా... అంటే మీరనుకునే బ్లూ జీన్స్ కాదు.. జన్యు కణాల ద్వారా వచ్చిందన్నమాట. 

అరే!... అలా... ఎలా అవుతుందిరా భాయ్! అని క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టకండి. మా నాన్న తర్వాత నేనే ముఖ్యమంత్రి అని కారాగార విడిదిగృహం నుండి అద్భుతమైన స్కెచ్ లు గీస్తున్నా ఆ (సాక్షి వారి)  మహానేత కొడుకు మన యువనేత జగన్నన్న, దేశానికే యువరాజు, కాబోయే ప్రధానమంత్రి అని కాంగ్రెస్ వారిచే దండోరా వేయబడుతున్న రాహుల్ గాంధీ గారు, ఈ మధ్యనే తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన అఖిలేష్ యాదవ్ గారు, ఇంకా చిన్నా చితకా ఎం.ఎల్.ఎ లు; ఎం.పిలుగా స్థిరపడ్డ మన నాయకుల పుత్ర రత్నాలే నాకు ఆదర్శం.

ఏమయ్యా! ప్రొద్దునే మీ పక్క అపార్ట్ మెంట్లో ఉన్న బెల్ట్ షాప్ కి  గాని వెళ్ళావా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావ్! దానికి దీనికి ఏమిటి సబంధం? ఇది ప్రాణాలతో పని.  రాజకీయంలో కొంచెం అనుభవం వస్తే వాళ్ళు కూడా బాగానే చేయొచ్చు కదా?

ప్రాణాలు? ఎవరివి? నీలోఫర్ హాస్పిటల్ లో  పోయే పసిగుడ్డులవా? బతికే దారిలేక ఆత్మహత్యలకు పాల్పడే అమాయక రైతులవా? లేక భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో పోయినవాళ్ళవా! 

అనుభవమా? నేను కూడా అదే చెప్ప్తున్నానండి. నేను కూడా రెండో మూడో బడుగు ప్రాణుల్ని హారీమనిపించాకా నేర్చుకుంటాను. దాంట్లో తప్పేముంది. కోట్ల మందిని పాలించే పాలకులకి ఒక న్యాయం నాకొక న్యాయమా? మనది ఎలాగూ రాచరిక ప్రజాస్వామ్యమే కదా?  పైపెచ్చు.. మన కర్మ సిద్ధాంతం ప్రకారం నేను ఒక వాహకం మాత్రమే! ఆ పోయే బక్క ప్రాణులు... వారి ఫూర్వ జన్మ పనుల వలననే కదా పోతారు. అయినా, వంద కోట్ల పై చిలుకు ఉన్న మన దేశ జనాబాలో... నా వల్ల పోయే ఆ రెండు ప్రాణాలు ఎవరికి అవసరం చెప్పండి? 

కాబట్టి... మీరంతా రోగం ఉన్నా లేకపోయనా మా  గట్టిగా చావండి (Die Hard) హాస్పిటల్స్ వచ్చి అవసరం ఉన్నా లేక పోయినా మా బావమరిది డయాగ్నొస్టిక్ సెంటర్ లో టెస్ట్స్ చేయించుకుని, నేను నాకు ఖాళీ ఉన్నప్పుడు ఇచ్చే అమృతతుల్యమైన మందులు (ఆ మందు కాదండోయ్!) మరియు మాత్రలు తీసుకుని, నన్ను బిలియనియర్ని కాకపోయినా మిలియనియర్ని చేసేయమనివిజ్ఞప్తి చేసుకుంటున్నాను.


Image source:
http://www.dreamstime.com/royalty-free-stock-images-set-ghosts-image18025459