Saturday, November 14, 2009

చింత బరికె!

మీరెప్పుడైనా చింత బరికె దెబ్బ రుచి చూశారా! మనం రుచి చూడడమే కాదు పుల్ గా భోజనం కూడా చేశాం. అప్పుడే ఆరవ తరగతి పరీక్షలు అయ్యిపోయాయి. బడికి వేసవి సెలవలు ఇచ్చేశారు. ఇంకేముంది కాలువ గట్లు, చెరువులు, పొలాల వెంబడి రాచకార్యాలు అన్నీ మావే. అలాంటి రోజుల్లొ,
ఒక రోజు! ఒరేయ్ శీనుగా! చుట్టూ చూశా ఎవరూ కనపడలా. ఒరేయ్ యెదవ, నేను కిట్టు గాణ్ణి ఇటు చూడు. మా ఇంటి పక్కనే ఉన్న దడి కన్నం లోంచి ఒంటికన్ను రాక్షసుడిలా కిట్టు గాడు. ఏంట్రా! ఏంటి విషయం?
మనం ముంజె కాయలు తిందాం వస్తావా?
వస్తా! కానీ ఎలా రా! మా నాన్న ఇంట్లొనే ఉన్నాడు. గేదెల్ని మేపుకుని వస్తానని చెప్పి రా. సరే అని చెప్పి గేదెల్ని తోలుకొని బయలుదేరా. మాతో పాటు బక్కోడు, జాంగాడు, చిన్నొడు, అగ్గి రాముడు తతిమా పిలకాయలందరిని వెంటేసుకుని వెళ్ళాం. అందరూ బర్రెల్ని పొలాల్లో వదిలేసి తాటి చెట్ల వైపు పరుగు తీసాం. కిట్టు గాడు, అగ్గి రాముడు, నేను చెట్లెక్కి ముంజెలు కోస్తే అందరం కలిసి తిన్నాం. కడుపు నిండాక చేతుల్లొ దురద మొదలైంది. దురద తీరాలంటే ఏమైనా చేయాలి కదా మరి! అందుకని కోతి కొమ్మచ్చి, కర్ర బిళ్ళ అడాం, అయినా ఇంకా సరిపొలేదు. దూరంగా కనిపిస్తున్న మాదిగోళ్ళ దిబ్బ మీద పడింది మా కన్ను. ఈ మాదిగోళ్ళ దిబ్బ అనేది పేకాటరాయుళ్ళకు స్వర్గధామం. ఇక్కడ పేకాట ఆడిన వాళ్ళకు ఇళ్ళు వళ్ళు మొత్తం గుల్ల అయ్యి చిప్ప చేతికి వస్తుందని మా వూరివాళ్ళ ప్రగాఢ నమ్మకం. మేము పెద్ద పోటుగాళ్ళలాగా అక్కడకు వెల్లాం. అక్కడ చెట్ల పొదల్లొ ఆడి పడేసిన పేక ముక్కలు కనపడ్డాయి. అవి ఏరుకుని మేమందరం ఎవరికీ కనపడకుండా చేలొ కూర్చుని ఆడటం (మొద్దు సెట్లు) మొదలుపెట్టాం. ఆట మంచి రసవత్తరంగా సాగుతుంది, నేను ఆటలొ పూర్తిగా లీనమైపొయి, మాంచి ఏకాగ్రతతొ ఆడుతున్నాను. కాసేపటికి నాతో అడుతున్న వాళ్ళంతా పేక ముక్కలు పడేసి గేదలవైపు పరుగో పరుగు. నాకేమి అర్ధం కాలేదు. చుట్టూ చూశా నాకేమి కనపడలా! మెల్లగా వెనక్కి తిరిగి చూశా. నాకు వెంటనే లాగు తడిచిపొయింది, అక్కడ నుండి మాయం అయ్యిపొతే బాగుండనిపించింది. అక్కడ కత్తి చేతపట్టిన ఉగ్ర నరసింహుడిలా చింత బరికెతో మా నాన్న. అసలే మా నాన్నకు కోపం ఎక్కువ. కోపం వచ్చినా ప్రేమ వచ్చినా వెంటనే బయటకు కక్కేయాల్సిందే. అక్కడ నుండి ఆ చింత బరికెతో బాదుతూ, బాదుతూ ఇంటికి తీసుకొచ్చారు. మధ్య దారిలో ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా నన్ను వదిలిపెట్టలేదు. ఆ దెబ్బలకు నాకు వళ్ళు బాగా పులిసిపొయి తరువాతి రోజు నూట రెండు జ్వరం, వళ్ళంతా దద్దుర్లు. కానీ మళ్ళీ మా నాన్నే నాకు సపర్యలు చేసి, హాస్పిటలో చూపించారు. అప్పటినుండి మళ్ళీ ఆ మాదిగోళ్ళ దిబ్బ వైపు కన్నెత్తి చూడ్డం కాని, డిగ్రీ వరకూ పేక ముక్కలు ముట్టుకోవడంగానీ చెయ్యలేదు.
మా ఇంటి చూరులో నాకొక హెచ్చరికగా చాలా సంవత్సరాల పాటు ఉన్నది ఆ 'చింత బరికె'.

Wednesday, November 4, 2009

మా ఊరు

పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో, భీమవరానికి దగ్గరలో ఒక ప్రశాంతమైన పల్లెటూరు మా ఊరు. ఆయ్! ఎంతయినా మా గోదావరి జిల్లాల వాళ్ళకు కూసింత మర్యాద ఎక్కువేనండి. మా ఊరికి వెళ్ళాలంటే ఎర్ర బస్సే దిక్కు. కాని ఈ మద్య సెల్ ఫొన్ ప్రభావం తో కాస్త కమ్యూనికేషన్స్ పెరిగినమాట వాస్తవమే. మా ఊరికి నాకు మధ్య విడదీయరని అనుబంధమే చాలానే ఉంది. నా మరుపు రాని, ఆహ్లదకరమైన చిలిపి బాల్యం, ఇంటర్మీడియట్ వరకు మనం వెలగబెట్టిన చదువు, ఇంకా యెన్నొ వెల కట్టలేని అనుభూతులకు సజీవ సాక్ష్యం మా ఊరు. అందుకే ఎప్పుడైనా మా ఊరు గుర్తుకు రాగానే మనస్సంతా అనంద సాగరం లొ చిందులేస్తుంది. చిన్నప్పటి ఆటలు, కాలువలొ ఈతలు, జామ కాయల దొంగతనాలు, గేదె మీద స్వారి, స్నెహితులతొ గొడవలు, నాన్న తిట్లు...... ఇలా ఒక్కటేమిటి అనేక అనుభవాలు, చిలిపి చేష్టలు, తీపి గురుతులు.
నేను కనపడని ఆ దైవానికి మొక్కుకునేది ఒక్కటే, కనీసం సంవత్సరంలొ ఒక సారైన మా ఊరు వెళ్ళి మా ఊరిని, బంధు మిత్రులందరని పలకరించే అవకాశం ఇమ్మని. ఎందుకంటే, ఈ బిజీ జీవితంలొ, ఉద్యొగమనే రాట్నంలొ పడి మనలొ చాలా మంది పుట్టిన ఊరుని, కావాల్సిన వారిని మర్చిపోతున్నారు. నేను వారిలొ ఒకడిని కాకూడదని ఒక చిన్ని అశ.