Wednesday, December 19, 2012

నేను చదివిన కొన్ని పుస్తకాలు – 1

ది అల్కెమిస్ట్ (The Alchemist) - పవులో క్క్వైలో (Paulo Coelho)
 


అడపా దడపా నేను చదివిన పుస్తకాల్లో అల్కెమిస్ట్ ఒకటి. పవులో గారికి అత్యంత పేరు తెచ్చిన నవల ఇది. ప్రపంచవ్యాప్తంగా 71 భాషలలోకి అనువదింపబడి, గిన్నీస్ బుక్ లో కూడా చేర్చబడ్డ సంటియాగో (Santiago) అనే చిన్న పిల్లవాడి కధ.
అల్కెమిస్ట్ చదివావా.... అది.... ఒక అరుపు, మెరుపు, తురుము అనే విశేషణాల వల్ల... ఒక మంచి ముహూర్తం చూసుకుని, కక్కుర్తిపడి కొనకుండా, ట్రైన్లో పక్కోడి పేపర్... వాడిని అడక్కుండా చదివేసే కుక్క తోక లాంటి అలవాటు వల్ల.... పక్క రూమ్ లో నుండి పుస్తకం తెచ్చుకుని చదివేసా. భూగోళంలో సృజించేవారు తక్కువ, దానిని విమర్శించే వారు ఎక్కువా కాబట్టి, అందునా మనం రెండో వర్గానికి చెందినవాళ్ళం కాబట్టి ఈ బొక్కు గురించి నా నాలుగు మాటలు.  
ముందుగా పుస్తకంలో విషయం ఏంటంటే,
నువ్వు నిజంగా ఏదైనా కావాలని గాట్టిగా తీర్మానించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రకృతి శక్తులన్నీ ఏకమై నీకు అది దక్కేలాగా సహాయం చేస్తాయి. నువ్వు చెయ్యల్సినా పని ఏంటయ్యా... అంటే నీ కలలను మనస్పూర్తిగా నమ్మి... వాటిని అనుసరించడమే.
రెండు ముక్కల్లో కధేంటంటే, సంటియాగో అనే గొర్రెల కాపరి.... తనకు మాటి మాటికీ వచ్చే కలలోని నిధిని నిజం చేసుకోవడానికి తన మందను అమ్మేసి...ఈజిప్ట్ కి బయలుదేరతాడు. దారిలో అతనికి ఎదురయ్యే వ్యక్తులు, అనుభవాలు, అపాయాల సమ్మేళనమే ఈ కధ.
ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన ఈ నవల నాకు అంతగా నచ్చలేదు అంటే.... నాలో అంత మంచి చదువరి లేడేమోనని ముందు బాధా, తర్వాతా జాలి....తర్వాతర్వాత..... నిద్ర ముంచుకొచ్చాయి. ఆ......అన్నీ అందరికి నచ్చాలని రూలేమీ లేదుకదా....అని ఆత్మారాం గాడ్ని బజ్జోపెట్టి... ఏమి నచ్చలేదు అని చించితే.... ఇదిగో ఇవి బయటపడ్డాయి.
రాసిన విధానం – మనకి కొరుకుడు పడాలా. పవులో గారు పోర్చుగీస్లో బాగా రాసారేమో కాని మనం చదివింది ఆంగ్లానువాదం కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చెప్పను, చెప్పలేనంతే.
పాడిందే పాటరా.....  అన్నట్టు చెప్పిందే మళ్ళీ  చెప్పి, తిప్పి తిప్పి  తిరిగి అదే చెప్పేటప్పటికి ఆవులింతలు వచ్చాయి.
చివరగా.... ఈ పుస్తకంలోని కాన్సెప్ట్ నేను టీనేజ్ లో ఉన్నప్పడు చదివినట్లయితే బాగా నచ్చేదేమో. ఇప్పుడు వాస్తవ ప్రపంచం గురించి మరీ అవసరం లేనంతగా (?)  తెలిసిపోయేటప్పటికీ నేను సినికల్ గా మారిపోయి ఈ కధని ఆస్వాదించలేకపోయానేమో.

 

2 comments:

  1. తెలుగు అనువాదం చూడలేదా....

    పుస్తకం నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి. మాంచి మోటివేషన్ ఇచ్చే బుక్కు.

    ReplyDelete
  2. ఈ పుస్తకంలోని కాన్సెప్ట్ నేను టీనేజ్ లో ఉన్నప్పడు చదివినట్లయితే బాగా నచ్చేదేమో. ఇప్పుడు వాస్తవ ప్రపంచం గురించి మరీ అవసరం లేనంతగా (?) తెలిసిపోయేటప్పటికీ నేను సినికల్ గా మారిపోయి ఈ కధని ఆస్వాదించలేకపోయానేమో.

    రెండో సారి (అంటే ఒక నెల క్రిత్రం) చదువుతున్నప్పుడు నాకూ ఇలాగే అనిపించింది :)

    బహుశా మోటివేషనల్ బుక్కులతో ఇదొక తంటా ఏమో!

    ReplyDelete

వినదగు నెవ్వరు చెప్పిన!
సందర్శకులందరకీ హృదయపూర్వక ధన్యవాదములు.

Thanks for stopping by. I would love to hear about your thoughts and welcome healthy discussions. But please do not use profane or abusive language.