Friday, December 21, 2012

ఇంతకీ నేనెవరంటే..............




తమ్ముడికెందుకు రెండు గుడ్లు... నాకెందుకు ఒక్కటే? అన్న అక్కతో, అమ్మ..... వాడు మగపిల్లాడు వాడితో నీకు పంతమా అని కసిరినప్పుడు చూసావా నా ప్రతాపం అని చూస్తూ ... గుడ్లు గుటుక్కుమనిపించిన పసివాడ్ని.

తమ్ముణ్ణి తోడు తీసుకెళ్ళు అని పదిహేనేళ్ళ అక్కతో.... నాన్న అన్నప్పుడు.... నా యొక్క గొప్పతనం మెల్లమెల్లగా నేర్చుకుంటున్న నాలుగేళ్ల చిన్నవాణ్ణి.   

వంటిట్లో పనేమైనా ఉందేమో చూసుకో ఈ దేశ రాజకీయాలు నీకెందుకు అని నాన్న అమ్మని విసుక్కున్నపుడు...పక్కనే ఉండి..... ప్రవర్తించే పద్ధతి నేర్చుకుంటున్న రేపటి భారతీయ పౌరుణ్ణి.

ఆడ పెత్తనం ఒక బోడి పెత్తనం అని నానమ్మ.... అమ్మ యొక్క మాటల్ని గడ్డిపరకలా తీసిపారేసినప్పుడు... పక్కనే నిశ్శబ్ధంగా........నడత నేర్చుకుంటున్న నూనూగు మీసాలవాణ్ణి. 

క్లాస్ లో, బస్టాప్ లో,  వీధి చివర గోడమీద కూర్చుని దారి వెంటే పోయే అమ్మాయిలను మాటలతో యేడ్పించి అది కాలేజీ కుర్రాళ్ళ   అమాయకపు సరదా అని కాలరెగరేసిన కుర్రాణ్ణి.

దీనికి రేపొద్దున్న బోల్డంతా కట్నాలు పోసి పెళ్లి చెయ్యాలి.... ఇప్పుడు చదువెందుకు దండగ అని..... అమ్మమ్మ చెల్లిని తిడుతున్నప్పుడు..... నిజమే కదా... అనుకున్న దగాకోరు అన్నయ్యని.

కట్నం తీసుకోవడం ఒక నీచాతి నీచమైన దురాచారం అని విశ్వవిద్యాలయంలో...... ఆదర్శం అనే ముసుగులో నీతులు వల్లించి...... మా అమ్మానాన్నల ఒత్తిడి వల్ల తల ఒగ్గాల్సివచ్చింది అని సమర్ధించుకునే దెయ్యాన్ని.

ఆఫీస్ లో మహిళా సహోద్యోగిపై.... పై అధికారి అనుచిత ప్రవర్తన కళ్ళారా చూసినా.... మౌనవ్రతం పాటించే చవట దద్దమ్మని.

బస్సులో ‘స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం... వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనే బోర్డు పక్కనే నిలబడి..... వారి అంగగంగాలను చూపులతోనే శోధించి, వేధించే చిన్న సైజు రేపిస్ట్ ని.

నా సహధర్మచారిణి..... నా కన్నా ఎక్కువ చదివినా, మంచి ఉద్యోగం చేస్తున్నా ఒప్పుకోలేని మానసిక దుర్భలుణ్ణి.

నా భార్య డాక్టర్ అయినా యాక్టర్ అయినా నా మాటే వేదవాక్కు లా పాటించాలనే ఆధిక్యతా జులుం ప్రదర్శించే శాడిస్ట్ భర్తని.   

స్త్రీ అంటే సృష్టికి మూలం, మహాశక్తి, ఆది పరాశక్తి, ఆకాశంలో సగం అని మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్న గడుసు పుండాకోర్ని.

ఢిల్లీలో లేదా మరోచోటో ఒక అమాయకపు ఆడపిల్ల పాశవిక అత్యాచారానికి గురైందని తెలిసినప్పుడు,........ అప్పుడు హటాత్తుగా నాలో మానవత్వం మేల్కొని, రక్తం మరిగి,......... నేను రొజూ చేసే, చూసే అత్యాచారాలు అనుకూలంగా మర్చిపోయి ...... ఆ నరరూప రాక్షసులను......ఉరి తీయ్యాలి, సంసారానికి పనికిరాకుండా చెయ్యాలి, రాళ్ళతో కొట్టి చంపాలి, కోసి కాకులకు గద్దలకు వెయ్యాలి... అని చిలక పలుకులు పలికే...... పచ్చి అవకాశవాదిని.     


ఇంతకీ నేనెవరంటే..............
మీ దురదృష్టం కొద్దీ ఒక క్రోమోసోము తేడా వల్ల మగవాడిగా పుట్టిన ఒక మానవ మృగాన్ని.  




Image source: http://themonkeyboylovescheese.mu.nu/archives/011001.html

5 comments:

  1. మూడు కాళ్ళ కుంటివాడివి

    ReplyDelete
  2. చురుక్కుమనిపించేలా లేదు, చర్నాకోలు ఝళిపించినట్లుగా వుంది. సమాజం తల దించుకునేట్లుగా చెప్పారు.

    ReplyDelete
  3. పచ్చి నిజాలు. ప్రతి ఇంట్లోనూ చర్చించాల్సిన నిజాలు. ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన నిజాలు చెప్పారు. కానీ అంత జ్ఞానోదయం మన దేశంలో అందరికీ కలగాలంటే ఎన్ని తరాలు గడవాలో. ఎంతమంది మహిళలు ఆశలు చంపుకొని అవకాశాలు వదులుకొని, అవమానాలకు గురౌతూ అత్యాచారాలకు గురౌతూ అణచివేయబడుతూ అణగారిపోవాలో...!

    ReplyDelete
    Replies
    1. తులసీ అందరికీ ఇదే అలవాటు. ఎంతసేపూ పక్కవారిని తిట్టడానికే ఇష్టపడతారు. పైన అంత మేటర్ రాశారుగానీ తానెవరో చెప్పలేదు. అంత ధైర్యం లేనివాళ్లు రాయడమెందుకు? మొత్తం మానవజాతిని ఒకటే గాటన కట్టేయడం సమంజసమా? మానవుడు అంటేనే స్వార్థపరుడు. ఆ స్వార్థంలో ఎక్కువా తక్కువా ఉంటాయి. ఇప్పుడున్న రోజుల్లో తక్కువ స్వార్థం ఉన్నవాళ్లు లేరా? ఉన్నారు. అలాంటి వాళ్లను మనం మంచివాళ్లు అంటున్నాం కదా. నాకు తెలిసి ఎవరూ కావాలని తప్పు చేయరు. పరిస్థితులు, పరిణామాలు అలా మార్చేస్తాయి. అంతెందుకు బుద్ధుడు లాంటి మనిషి ఇప్పుడున్న రోజుల్లో బతకగలడా? అసాధ్యం. అబద్ధం ఆడకుండా ఉండగలమా? పరిస్థితులను బట్టి తప్పదు. బయట ఎన్ని చట్టాలున్నా... ప్రతి మనిషిలో ఓ కోర్టు ఉంటుంది. అది ఏది సరి అనిపిస్తే... అదే చేయిస్తుంది. అలాంటప్పుడు... ఇది తప్పు... ఇది రైటూ అని మనం ఎలా చెప్పగలం. మన కళ్లకు అది తప్పుకావచ్చేమో... వాళ్లకు అది రైటే కావచ్చేమో... ఇవన్నీ పెద్ద డిబేట్లే. వీటిపై చర్చించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అవి ఓ పట్టాన తెగవు. ఒక్కటి చెబుతా... ప్రతి దాంట్లోనూ పాజిటివ్ వెతుకుదాం... కనీసం అలాగైనా సంతృప్తి దొరకొచ్చు...!!

      Delete
  4. ఇంతమంచి బ్లాగ్ చాలా లేట్ గా చూస్తున్నందుకు బాధపడుతున్నా.. కానీ లేటెస్ట్ పోస్టులు లేవెందుకో..?

    ReplyDelete

వినదగు నెవ్వరు చెప్పిన!
సందర్శకులందరకీ హృదయపూర్వక ధన్యవాదములు.

Thanks for stopping by. I would love to hear about your thoughts and welcome healthy discussions. But please do not use profane or abusive language.