Sunday, December 16, 2012

విజయవంతంగా ముష్టి వ్యాపారం చేయడం ఎలా?




వెంకాయమ్మ కల్లు పాక వెనుక చింతచెట్టు నీడలో అప్పుడే డ్యూటీ దిగిన సత్తెయ్య, అప్పిగాడు గుఱ్ఱం ఎక్కే పనిలో హడావుడిగా ఉన్నారు.
మావా! నీకు ఈ పెపంచకంలో శానా విసయాలు తెలుసని మనోళ్ళు అనుకుంటున్నారు. నువ్వు మాకన్నా ఎక్కువ సంపాయిస్తన్నావు. నేను రోజంతా అడుక్కున్నా రెండు సీసాల కల్లుకి, ఒక బిర్యానీ పొట్లంకి కూడా సాలట్లేదు. ఎలా మావా..... అడిగాడు అప్పిగాడు.
సత్తెయ్య అర్ధనీలిమ నేత్రాలతో.... పక్కనే ఆకులో ఉన్న ఆవకాయ పచ్చడిని నాలుక మీద రాసుకుంటూ....... చిరునవ్వు నవ్వాడు.
అట్టా ఏదాంతిలాగ  నవ్వమాక! నాకు సిర్రెత్తుకొచ్చేతాది...
నేను రెండు పెస్నలు అడుగుతా.. సమాధానం సెప్పు. మొదటది, నీ బొచ్చెలో మా కన్నా ఎక్కువ సిల్లర ఎందుకు పడుతాది? రెండు, లచ్చలచ్చాలు తగలేసి మేము మా బుడ్దోల్నిఇంగిలీసు సదువుకి పంపుతా ఉంటే, నువ్వెందుకు మీవాన్ని తెలుగు బల్లోకి పంపుతున్నావ్?
ఒరే అప్పిగా, ఇయన్నీ సెప్పాలంటే కూసంత కర్సయిద్దిరా..... అన్నాడు సత్తెయ్య.
ఇదేగా నీ కర్సు ...తీసుకో అంటూ ఒక ఫుల్ కల్లు సీసాని ముందుకు జరిపాడు.
అప్పిగా....నువ్వు ఉస్సేను బోల్టుగాని కంటే ఫాస్ట్ రా....
ఈ బోల్టులు, నట్టులు మనకు తెల్దు కాని......ఇసయం చెప్పు మావా........ అన్నాడు అప్పిగాడు విసుగు మొహంతో.
ఒరే... నువ్వు బిచ్చమెత్తడానికి పోయినప్పుడు ఏమని అడుగుతావు?
అమ్మా.... కొంచెం బిచ్చం పెట్టు తల్లీ..... అని ........అన్నాడు అప్పిగాడు బొచ్చె పైకెత్తి.
సరే... ఆ మాతల్లి దొడ్డ మనసు సేసుకుని మొగుడికి పస్తు పెట్టి నీకు బిచ్చం ఏసిందనుకో.... తర్వాత ఏమంటావ్?
పదికాలాల పాటు సల్లగుండమ్మా అంటా..... చెప్పాడు అప్పిగాడు.
నేనైతే..... ఎల్లగానే భవతీ బిక్షాం దేహీ అనీ... బిచ్చం పెట్టిన తరవాత ‘దీర్ఘాయ్షుమాన్భవ’ అంటాను..... అని రహస్యం చెప్పాడు సత్తెయ్య.
అంటే ..... అర్ధంకాక బుర్ర బరుక్కున్నాడు ....అప్పిగాడు.
ఒరే సన్నాసీ..... నువ్వు అన్నది ...నేను సెప్పింది ఒకటే. నేను మన పూరపోల్లు సెప్పినట్టు సెప్పా అంతే తేడా..
ఈ పట్టు... నేను సెప్పినట్టు సెప్పు ....తరవాత ఆ ఆడ లేడీసు నీ పేరేంటి? అని అడుగుతారు. అప్పుడు ...... నీ పేరు ‘అప్పీసు బాబా’ అని, దేశ సంచారం సేత్తనానని  చెప్పు. యంటనే ఆ యమ్మ కండ్లల్లో... కల్లు మత్తులాంటి... బత్తి మత్తు ఓటి కానొచ్చినాదనుకో... నీ బొచ్చె బోసానం అయ్యిపోద్ది. 

యింక నీ రెండో పెస్నకి సమాదానం యేంటంటే......ఇంకో పది పదేనేల్లుకి ఈ మనుసులు ఈ కూసంత తెలుగు బాస కూడా మర్సిపోతే..... మావోడు నాకన్నా బాగా సంపాయించి.... వాడి తాగాతుకి తగ్గట్టు ఒకటో రెండో అయిలాండులు సీలంక పక్కవాటునే కొనుక్కుంటాడని ఒక అవిడియా.... అంటూ సీసాలో మిగిలిన సరుకుని ఎక్కించాడు.   
మావా... నువ్వు ఈడ ఉండాల్సినోడివి కాదు…… అన్నాడు అప్పిగాడు సత్తెయ్యని కిట్ట పరమాత్ముని లెక్క చూస్తూ..
తెల్సులేరా.... అన్నాడు సత్తెయ్య జోగుతూ ...

***
విజయవంతంగా ముష్టి వ్యాపారం చేయడం ఎలా?
మరిన్ని సూచనలకు, సలహాలకు నేడే సంప్రదించండి.
సత్తానంద సామి
వెంకాయమ్మ కల్లు పాక వెనుక,
బొచ్చె వారి కాలనీ,
మద్యంపూర్, హైదరాబాద్ – 500081.
ఫోన్ – 091-9812345678.
****



Image source: http://www.fun2video.com/funny-beggar/

2 comments:

  1. విజయవంతంగా ముష్టి వ్యాపారం చేయడం ఎలా?

    టాప్ సీక్రెట్ అండీ, ఎవరకీ చెప్పకండేం, మీకు మాత్రమే చెబుతున్నా, కిటుకు- దేశం లో అందర్నీ డబ్బులున్న వాళ్ళని గా చేసి, మనం మన మునుపటి ప్రొఫెషన్ లో కంటిన్యూ అయి పొవాలన్న మాట! అప్పుడేమొ, మనకి కాంపిటీషన్ ఉండనే ఉండదన్న మాట. !

    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. హ...హ... మీ కిటుకేదో బానే ఉన్నట్టున్నదండి. అందరిని డబ్బున్న వాళ్ళకింద చెయ్యాలంటే రాజకీయాల్లో చేర్పిస్తే సరి.

      Delete

వినదగు నెవ్వరు చెప్పిన!
సందర్శకులందరకీ హృదయపూర్వక ధన్యవాదములు.

Thanks for stopping by. I would love to hear about your thoughts and welcome healthy discussions. But please do not use profane or abusive language.